రిటైల్ వెంచర్లో పెట్టుబడులు సమీకరించడం ప్రారంభించిన పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా ఈ–కామర్స్‌లో పోటీ సంస్థ అమెజాన్‌డాట్‌కామ్‌తో కూడా చేతులు కలిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్)లో 40 శాతం దాకా వాటాలను అమెజాన్‌కు విక్రయించేందుకు సుముఖంగా ఉన్నట్లు వార్తా కథనాలు వచ్చాయి. ఈ డీల్ విలువ సుమారు 20 బిలియన్ డాలర్ల మేర ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్ఆర్వీఎల్లో ఇన్వెస్ట్ చేయడంపై అమెజాన్ ఆసక్తిగా ఉందని, దీనిపై చర్చలు కూడా జరిపిందని పేర్కొన్నాయి. కుదిరితే ఇది దేశంలోనే అత్యంత భారీ డీల్ కాగలదని తెలిపాయి. అయితే, అమెజాన్ ఇంకా పెట్టుబడుల పరిమాణంపై తుది నిర్ణయం తీసుకోలేదని, చర్చలు ఫలవంతం కాకపోయే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొన్నాయి. మరోవైపు, ఈ కథనాలపై వ్యాఖ్యానించేందుకు రిలయన్స్, అమెజాన్ నిరాకరించాయి. మీడియా ఊహాగానాలపై తాము వ్యాఖ్యానించలేమని స్టాక్ ఎక్సే్చంజీలకు రిలయన్స్ తెలియజేసింది. పరిస్థితులను బట్టి వివిధ వ్యాపార అవకాశాలు పరిశీలిస్తూ ఉంటామని పేర్కొంది. పాఠకులు.. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఊహాగానాల ఆధారంగా నిరాధార/తప్పుడు వార్తలను ప్రచురించవద్దని ఒక ప్రకటనలో మీడియాకు విజ్ఞప్తి చేసింది.