40 శాతం మందికి స్మార్ట్‌ఫోన్లు, ఐపాడ్స్, ట్యాబ్స్‌


రాష్ట్రవ్యాప్తంగా 85 శాతం ఇళ్లలో టీవీలున్నట్టు ప్రభుత్వ పరిశీలనలో వెల్లడైంది. ఇటు 40 శాతం మంది స్మార్ట్‌ఫోన్లు, ఐపాడ్స్, ట్యాబ్స్‌ వంటివి ఉపయోగిస్తున్నారని, కేవలం 6.8% మందికి మాత్రమే ఈ సదుపాయాలేవీ లేవని తేలింది. ప్రభుత్వపరంగా ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ నేపథ్యంలో రాష్ట్రంలో ఎంతమందికి ఈ సౌకర్యాలున్నాయి.. ఏ సాధనాల ద్వారా మారుమూల ప్రాంతాల్లోని వారిని చేరుకోవచ్చు.. తదితర అంశాలపై నిర్వహించిన సర్వేలో భాగంగా ఆయా విషయాలు తెలిశాయి. వివిధ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఈ–లెర్నింగ్‌ చేపడుతున్నట్లు, ఎక్కువ మంది విద్యార్థులకు పాఠాలు అందుబాటులో తెచ్చేందుకు దూరదర్శన్, టీ–శాట్‌ల ద్వారా ఆన్‌లైన్‌ తరగతులను ప్రసారం చేస్తున్నట్టు, వీటిని 85 శాతం విద్యార్థులు వీక్షిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా స్కూళ్లను తెరవాల్సి ఉంటుందని, ఈ నెల 21 నుంచి నుంచి వాటిని తెరిచే అవకాశాలున్నట్టు తెలుస్తోందన్నారు. అయితే ఇప్పుడిప్పుడే విద్యార్థులను స్కూళ్లకు పంపించేందుకు తల్లిదండ్రులు సుముఖంగా లేరనే అభిప్రాయం వినిపిస్తోందన్నారు. మంగళవారం శాసనమండలిలో ఆన్‌లైన్‌ తరగతులపై ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. మొత్తంగా 48,150 వాట్సాప్‌ గ్రూప్‌లను ఏర్పాటు చేయడంతో పాటు 86 వేల మంది పేరెంట్స్‌తో అధికారులు మాట్లాడి ఈ తరగతులు సవ్యంగా జరిగేటట్టు చర్యలు చేపట్టారని మంత్రి సబిత చెప్పారు. మొత్తం 16 విశ్వవిద్యాలయాల స్థాపనకు పిలిస్తే 9 దరఖాస్తులు వచ్చాయని వాటిలో 8 సమ్మ తించినట్లు, మొదటి దశలో 5 వర్సిటీలకు అనుమతినిస్తున్నట్టు సబితా తెలిపారు.