ఈ ఏడాది రూ. 927 కోట్లు సంపాదించిన అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌


అంతర్జాతీయస్థాయిలో తన జట్టుకు ఎలాంటి గొప్ప టైటిల్స్‌ అందించలేకపోయినా... ఆర్జనలో మాత్రం అర్జెంటీనా ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌ లయెనల్‌ మెస్సీ టాప్‌ ర్యాంక్‌లో ఉన్నాడు. ‘ఫోర్బ్స్‌’ పత్రిక వివరాల ప్రకారం ఈ ఏడాది అత్యధిక మొత్తం సంపాదించిన ఫుట్‌బాల్‌ ఆటగాళ్లలో మెస్సీకి తొలి స్థానం దక్కింది. అతను ఈ ఏడాదిలో 12 కోట్ల 60 లక్షల డాలర్లు (రూ. 927 కోట్లు) ఆర్జించాడు. ఇందులో 9 కోట్ల 20 లక్షల డాలర్లు వేతనం ద్వారా రాగా... మిగతా 3 కోట్ల 40 లక్షల డాలర్లు వాణిజ్య ఒప్పందాల ద్వారా సంపాదించాడు. 15 ఏళ్ల నుంచి స్పెయిన్‌కు చెందిన విఖ్యాత క్లబ్‌ బార్సిలోనా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మెస్సీ ఈ ఏడాది బార్సిలోనా జట్టు ఒక్క టైటిల్‌ కూడా సాధించకపోవడంతో క్లబ్‌ను వీడాలనుకుంటున్నానని తెలిపాడు. కానీ ఒప్పందం ప్రకారం మెస్సీ వచ్చే ఏడాది వరకు బార్సిలోనా జట్టుతోనే ఉండాలి. ముందుగానే వెళ్లిపోతే భారీస్థాయిలో పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మెస్సీ తన ఆలోచనను విరమించుకొని మరో ఏడాదిపాటు బార్సిలోనాతోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నాడు.