సెన్సెక్స్‌ 95 పాయింట్లు అప్‌- 38,068కు


వరుసగా రెండో రోజూ దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాటనే ఎంచుకున్నాయి. దీంతో ఆద్యంతం ఒడిదొడుకుల మధ్య కదిలాయి. చివరికి సెన్సెక్స్‌ 95 పాయింట్లు బలపడి 38,068 వద్ద నిలిచింది. వెరసి 38,000 పాయింట్ల కీలక మార్క్‌ను అధిగమించింది. ఇక నిఫ్టీ 25 పాయింట్లు పుంజుకుని 11,247 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38,236 వద్ద గరిష్టాన్ని తాకగా.. 37,828 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇదే విధంగా నిఫ్టీ సైతం 11,295- 11,185 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. బీపీసీఎల్‌ బోర్లా ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ ఇండెక్స్‌ 2 శాతం డీలాపడగా.. పీఎస్‌యూ బ్యాంక్స్‌, రియల్టీ, ఆటో 1-0.4 శాతం మధ్య నీరసించాయి. ఎఫ్‌ఎంసీజీ 1.4 శాతం పుంజుకుంది. ఫార్మా, ఐటీ 0.5 శాతం స్థాయిలో బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో గ్రాసిమ్‌, టెక్‌ మహీంద్రా, టైటన్‌, నెస్లే, డాక్టర్‌ రెడ్డీస్‌, శ్రీ సిమెంట్‌, సిప్లా, యూపీఎల్‌, బ్రిటానియా, హెచ్‌యూఎల్‌, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఏషియన్‌ పెయింట్స్‌ 3-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే బీపీసీఎల్‌ 9 శాతం పతనంకాగా.. ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఇండస్‌ఇండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, కోల్‌ ఇండియా, గెయిల్‌, ఐవోసీ, హిందాల్కో, సన్‌ ఫార్మా, ఎంఅండ్‌ఎం, ఐసీఐసీఐ 3.7-1 శాతం మధ్య డీలాపడ్డాయి.