సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌ సమస్యలపై ఎన్‌జీటీ స్పందన


తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్‌ మైన్‌‌ కారణంగా ఉత్పన్నమయ్యే కాలుష్య పరిస్థితుల గురించి అధ్యయనం చేసేందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్‌జీటీ) నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను నవంబర్ 9లోగా అందించాలని ఆదేశించించింది. ఈ కమిటీలో కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ పర్యావరణ శాఖ, తెలంగాణ గనుల శాఖ, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్పప్లోసివ్స్ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని తెలిపిన ఎన్‌జీటీ చెన్నై బెంచ్‌.. కమిటీ సమన్వయ బాధ్యతను కేంద్ర పర్యావరణ శాఖ చెన్నై ప్రాంతీయ అధికారికి అప్పగించింది. కాగా సత్తుపల్లిలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల వల్ల ఉత్పన్నమయ్యే కాలుష్యంపై స్థానిక ఎన్టిఆర్ కాలనీవాసి బానోతు నందు నాయక్ పిటిషన్‌ దాఖలు చేశాడు. జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ దీనిపై మంగళవారం విచారణ చేపట్టింది.