చట్టసవరణతో క్రయవిక్రయాలకు అవకాశం


అన్యాక్రాంతమైన అసైన్డ్‌భూములను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నిరుపేదల జీవనోపాధి నిమిత్తం పంపిణీ చేసిన భూములు చేతులు మారితే.. వారికి యాజమాన్య హక్కులు కల్పించేదిశగా యోచిస్తోంది. ఈ మేరకు చట్ట సవరణ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే, అసైన్డ్‌దారు నుంచి పరాధీనమైన భూములను పీవోటీ చట్టం కింద వెనక్కి తీసుకున్న తర్వాతే భూముల ను క్రమబద్ధీకరించనుంది. అసైన్‌మెంట్‌ నిబంధనల ప్రకారం అసైన్డ్‌ భూముల క్రయ విక్రయాలు చెల్లవు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 24 లక్షల ఎకరాల మేర భూములను పేదలకు పంపిణీ చేయగా.. ఇందులో సుమారు 2.41 లక్షల ఎకరాల వరకు ఇతరుల గుప్పిట్లోకి వెళ్లినట్లు రెవెన్యూశాఖ తేల్చింది. పట్టణీకరణతో అసైన్డ్‌ భూముల్లో ఇళ్లు వెలిశాయి. కొన్ని చోట్ల బడాబాబులు, సంపన్నవర్గాల చేతుల్లోకి వెళ్లి ఫాంహౌస్, విలాసకేంద్రాలుగా మారిపోయాయి.