శాసనసభలో రెవెన్యూ బిల్లుపై చర్చలో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క


నూతన రెవెన్యూ చట్టంలో భాగంగా ఆన్‌లైన్‌ ప్రక్రియకు ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ రికార్డులను మాన్యువల్‌గా కూడా నిర్వహించాలని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క అన్నారు. ఆన్‌లైన్‌ ప్రక్రియతో సేవలు సులభతరమైనప్పటికీ... వెబ్‌సైట్‌లను హ్యాక్‌ చేసే అవకాశం ఉందని, దీంతో రికార్డుల్లో లబ్ధిదారుల పేర్లు తారుమారయ్యే ఆస్కారముందనే ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌ రికార్డు వ్యవస్థకు సమాంతరంగా మాన్యువల్‌ రికార్డులను కూడా నిర్వహిస్తే భవిష్యత్తులో సమస్యలు తలెత్తే అవకాశం ఉండదని అభిప్రాయపడ్డారు. మాన్యువల్‌ రికార్డుల నిర్వహణ మరింత సులభతరంగా అయ్యేలా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా శుక్రవారం రెవెన్యూ బిల్లుపై జరిగిన చర్చలో భట్టివిక్రమార్క మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టాలనుకున్న డిజిటల్‌ సమగ్ర భూసర్వేకు తాము పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ సమగ్ర భూసర్వేను ఎలా చేపడతారనే దానిపై మరింత స్పష్టత ఇవ్వాలని, ప్రభుత్వ యంత్రాంగం ద్వారా చేస్తారా? లేక ప్రైవేటు సంస్థకు ఈ బాధ్యతలు అప్పగిస్తారనే దాన్ని ప్రభుత్వం ప్రకటించాలని సూచించారు. ఇదివరకు కర్ణాటక ప్రభుత్వం ఓ ప్రైవేటు ఐటీ కంపెనీతో కలిసి రికార్డుల నిర్వహణ చేసిందని, కానీ మధ్యలో నెలకొన్న అవాంతరాలతో ఆ కంపెనీ నిర్వహణ ప్రక్రియను పూర్తిగా వదిలేసిందని, ఇలా మధ్యలో వదిలేయకుండా పక్కాగా జరిగేలా చూడాలన్నారు. ధరణితో రెవెన్యూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ప్రభుత్వం ఇదివరకు చెప్పిందని, కానీ మాన్యువల్‌ రికార్డులన్నీ సాఫీగా ఉన్న వారికే పాసుపుస్తకాలు ఇచ్చారని, ఇతర సమస్యలను పట్టించుకోలేదని పేర్కొన్నారు.