అపరిచిత వీడియో కాల్స్‌తో జాగ్రత్త


అపరిచిత వ్యక్తులు.. ముఖ్యంగా మహిళల నుంచి మీకు వీడియో కాల్స్‌ వస్తున్నాయా? అయితే జాగ్రత్త.. వాటికి ఏమాత్రం ఆన్సర్‌ చేయకండి. చేస్తే అంతే సంగతులు. మరుసటి రోజు నుంచి మీ ఫోన్‌కు మీ నగ్న వీడియోలు పంపుతారు. అలా ఎలా? సాధ్యమని అడగకండి. ఫేస్‌ మార్పింగ్‌ యాప్స్‌ బోలెడు ఉన్నాయి. వాటిని బంధువులు, స్నేహితులకు పంపుతామని, ఇంటర్‌నెట్‌లో పెడతామని వేధింపులు మొదలవుతాయి. పోనీ ఓసారి అడిగినంత చెల్లిస్తే అక్కడితో ఆగరు.. ఇంకా కావాలంటూ వేధింపులకు దిగుతారు. కాల్‌ చేసి.. మేము మీకు తెలిసిన వారమేనని, మనం గతంలో కలిశామంటూ మాట కలుపుతారు. యాంటి కరప్షన్, గుడ్‌ సొసైటీ అంటూ వాట్సాప్‌ డీపీలు పెట్టుకుంటారు. ఇదిచూసి మంచి వారేనని కాల్‌ లిఫ్ట్‌ చేస్తే.. ఇక అంతే! ఓ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికి కూడా.. హైదరాబాద్‌లో ఓ ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. యాంటి కరప్షన్‌ అన్న డీపీ ఉండటంతో ఆయన మాట్లాడారు. మరునాడు ఫోన్‌ వచ్చింది. అర్జెంటుగా రూ.20వేలు నా నంబర్‌కు గూగుల్‌ పే చేయి అనగానే.. ఎందుకు? అని నిలదీశాడు. అతన్ని లైన్లో ఉండమని చెప్పి, వాట్సాప్‌ చూసుకోమన్నాడు. వీడియో చూసి ఆ ఉద్యోగి కంగుతిన్నారు. ఓ మహిళతో తాను సన్నిహితంగా ఉన్న వీడియో చూసి నోటమాటరాలేదు. వెంటనే డబ్బులు చెల్లించారు. లండన్‌ బాబు దీనగాథ ఇది.. నిజామాబాద్‌కు చెందిన ఓ అబ్బాయి లండన్‌లో చదువుతున్నాడు. అతనికి ఇండియా నుంచి ఈ మధ్య ఓ వీడియో కాల్‌ వచ్చింది. రెండు రోజులు సరదాగా మాట్లాడాడు. తరువాత అతని వాట్సాప్‌కు ఓ వీడియో క్లిప్‌ను పంపారు. అందులో అతను నగ్నంగా ఉన్న దృశ్యాలు కనిపించాయి. అడిగినంత డబ్బు వెంటనే చెల్లించాలని లేకపోతే.. వీటిని మీ బంధువులకు పంపుతానని బెదిరించారు. ఆ అబ్బాయి వాటికి భయపడలేదు.. ఏమైనా చేసుకో అని గట్టిగా సమాధానమిచ్చాడు. వెంటనే సదరు అబ్బాయి బంధువులు, స్నేహితులతో ఓ వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేశారు. అందులో వీడియో పోస్టు చేశారు. అప్పుడు భారత కాలమానం ప్రకారం.. రాత్రి 2 గంటలు. లండన్‌లో రాత్రి 10 గంటలు ఈ వ్యత్యాసాన్ని బాగా సొమ్ము చేసుకుంటున్నారు. గంటలోగా డబ్బులు గూగుల్‌ పే, ఫోన్‌ పే ద్వారా చెల్లించకపోతే వీడియో అలాగే ఉంచేస్తామన్నారు. దీంతో ఆ అబ్బాయి వారు అడిగినంత చెల్లిస్తూ పోయాడు. ఈ మధ్య విద్యార్థి డబ్బులు ఇవ్వలేదని ఆ గ్రూపులో వీడియో ఒకటి ఉంచారు. దీంతో బంధువులు, స్నేహితుల వద్ద ఆ యువకుడు తలెత్తుకోలేకపోతున్నానంటూ వాపోతున్నాడు. తాను అలాంటి వాడిని కాను అని మొత్తుకుంటున్నాడు. కొందరు నమ్ముతున్నారు.. కొందరు నమ్మడం లేదు.