అధికార టీఆర్‌ఎస్ సన్నాహక సమావేశాలకు శ్రీకారం


నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. ఈ స్థానం వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కానుంది. దీంతో పట్టభద్రుల ఓట్ల నమోదు, ఎన్నికల్లో పోటీ అంశాలపై ఆయా పార్టీల్లో చర్చ మొదలైంది. అధికార టీఆర్‌ఎస్‌ ఈ మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు మొదలుపెడుతోంది. జిల్లాలో తొలి సమావేశం మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆదివారం జరగనుంది. మూడు జిల్లాల పరిధి ఉన్న పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక కోసం ఆ పార్టీ.. తక్కెళ్లపల్లి రవీందర్‌రావును ఇన్‌చార్జ్‌గా నియమించిందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్పాయి. మరోవైపు టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం, ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్, యువ తెలంగాణ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాణి రుద్రమ ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి క్షేత్ర స్థాయిలో అప్పుడే ప్రచారం మొదలు పెట్టారు.