రియల్టీ, ఫార్మా, ఆటో అప్‌- మీడియా, ప్రభుత్వ బ్యాంక్స్‌ వీక్‌


స్వల్ప ఊగిసలాట మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి జోరందుకున్నాయి. చివరికి సెన్సెక్స్‌ 259 పాయింట్లు ఎగసి 39,303 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 83 పాయింట్లు పుంజుకుని 11,605 వద్ద స్థిరపడింది. అయితే తొలి సెషన్‌లో మార్కెట్లు స్వల్ప హెచ్చుతగ్గులను చవిచూశాయి. మిడ్‌సెషన్‌ నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇవ్వడంతో లాభాలతో నిలిచాయి. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 39,360- 39,038 పాయింట్ల మధ్య ఊగిసలాడగా.. నిఫ్టీ 11618- 11517 పాయింట్ల మధ్య ఒడిదొడుకులను చవిచూసింది. డాక్టర్‌ రెడ్డీస్‌ జోరు ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా రియల్టీ, ఫార్మా, ఆటో రంగాలు 2.3-1.5 శాతం మధ్య ఎగశాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ సైతం 0.5 శాతం స్థాయిలో పుంజుకోగా.. మీడియా 1.6 శాతం, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 0.5 శాతం చొప్పున డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో డాక్టర్‌ రెడ్డీస్ 4.5 శాతం జంప్‌చేయగా.. ఎంఅండ్‌ఎం, హిందాల్కో, బజాజ్‌ ఆటో, బ్రిటానియా, సన్‌ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, విప్రో, సిప్లా, ఎల్‌అండ్‌టీ 4-1.4 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఇండస్‌ఇండ్‌, ఎన్‌టీపీసీ, ఇన్‌ఫ్రాటెల్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌, ఓఎన్‌జీసీ, ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, జీ, ఐటీసీ, గెయిల్‌, యూపీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.