నాలుగో తరగతి వైద్య సిబ్బంది వేతనాల పెంపు!

  


 ఆసుపత్రుల్లో పనిచేస్తున్న నాలుగో తరగతి వైద్య సిబ్బందికి శుభవార్త. ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న వారందరి వేతనాలు పెంచాలని సర్కార్‌ యోచిస్తోంది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ కూడా సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. కరోనా వేళ ఆయా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, రోగులకు సేవలందించే సిబ్బంది కీలకపాత్ర పోషిస్తు న్నారు. కరోనా నేపథ్యంలో తమకు ప్రత్యేక ప్రోత్సాహకం అందించాలని వారు ఇటీవల ప్రభుత్వానికి విన్నవించారు. ఈ విషయంపై మంత్రి ఈటల రాజేందర్‌.. బుధ, గురువారాల్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అలాగే కార్మిక, ప్రజాసంఘాల నాయకులతోనూ సమావేశమై వారి నుంచి సలహాలు తీసుకున్నారు. ప్రోత్సాహకమిస్తే కరోనా కాలం వరకే పరిమితం అవుతుందని, అలా కాకుండా వేతనం పెంచడం వల్ల శాశ్వత లబ్ధి జరుగుతుందని మంత్రి భావించారు. ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా కేసీఆర్‌ కూడా సానుకూలంగా స్పందించినట్లు వైద్యాధికారులు తెలిపారు. దీంతో ఆయా ఆసుపత్రుల్లో పనిచేసే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరికీ వేతనాలు పెంచే విషయంపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.