నాలుగు నెలల ప్రతికూలత తర్వాత ఎగువబాటకు మొదటిసారి


ప్రభుత్వం సోమవారం నాడు ఆగస్టుకు సంబంధించి అటు టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలను, ఇటు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం గణాంకాలను విడుదల చేసింది. టోకు ద్రవ్యోల్బణం 0.16 శాతం నమోదయితే, రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.69 శాతంగా నమోదయ్యింది. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ విడుదల చేసిన టోకు ధరల గణాంకాల్లో కీలక అంశాలను పరిశీలిస్తే... టోకు డిమాండ్‌ మెరుగుపడుతుందనుకోలేం! టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం నాలుగు నెలల తర్వాత మొట్టమొదటిసారి ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితుల నుంచి బయటపడింది. ఆగస్టులో ద్రవ్యోల్బణం 0.16 శాతంగా నమోదయ్యింది. అంటే 2019 ఆగస్టుతో పోల్చితే 2020 ఆగస్టులో టోకు బాస్కెట్‌లోని మొత్తం ఉత్పత్తుల ధర 0.16 శాతం పెరిగిందన్నమాట. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ విధించిన తర్వాత వరుసగా ఏప్రిల్‌ (– 1.57%), మే (–3.37%), జూన్‌ (–1.81%), జూలై (–0.58%) నెలల్లో ప్రతికూల టోకు ద్రవ్యోల్బణం రేట్లు నమోదయ్యాయి.