ఈ ఏడాది పండుగ సీజన్ ఈ కామర్స్ కంపెనీల సంబరాలను రెట్టింపు చేసే అవకాశం ఉంది. ఈసారి ఆన్లైన్ అమ్మకాలు రెండింతలు ఉండొచ్చని రెడ్సీర్ రీసెర్చ్ నివేదిక చెబుతోంది. గతేడాది ఈ–కామర్స్ కంపెనీలు సాధించిన గ్రాస్ మర్చండైజ్ వాల్యూ(జీఎంవీ) 3.8 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఈ ఏడాది జీఎంవీ 7 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చని నివేదిక సర్వే అంచనా వేసింది. ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ ద్వారా జరిగే లావాదేవీల స్థూల విలువను జీఎంవీగా పిలుస్తారు. ఆన్లైన్ కొనుగోళ్లకు డిమాండ్ ఇందుకే.. కోవిడ్–19 తర్వాత కస్టమర్లు గతంలో కంటే సురక్షితమైన, శుభ్రమైన, సౌకర్యవంతమైన రీతిలో షాపింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ కామర్స్ సంస్థలు అలాంటి సదుపాయాల కల్పనను సిద్ధం చేసుకున్నాయి. ఇందులో భాగంగా వీడియో, వాట్సాప్ ఆధారిత షాపింగ్ విధానంతో ఈ కామర్స్ కంపెనీలు కొత్త షాపింగ్ విధానానికి తెరతీశాయి. మా సర్వేలో అధిక శాతం కస్టమర్లు ఆన్లైన్ కొనుగోళ్లకే మొగ్గుచూపుతున్నారు’’ అని రీసెర్చ్ సంస్థ తెలిపింది.