యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ చాంపియన్‌ డొమినిక్‌ థీమ్


ఒకదశలో నాలుగోసారి అందివచ్చిన ‘గ్రాండ్‌’ టైటిల్‌ అవకాశం డొమినిక్‌ థీమ్‌ నుంచి చేజారిపోతుందా అనిపించింది. కానీ గత మూడు ‘గ్రాండ్‌’ ఫైనల్స్‌లో ఎదురైన ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్న థీమ్‌ నేలకు కొట్టిన టెన్నిస్‌ బంతిలా పైకి వచ్చాడు. తొలి రెండు సెట్‌లు కోల్పోయి... ఐదో సెట్‌లో 3–5తో వెనుకబడి... పరాజయం ముంగిట నిలిచిన ఈ ఆస్ట్రియా ఆటగాడు తన స్వశక్తిపై, తన ఆటతీరుపై నమ్మకం కోల్పోకుండా ఆఖరి పాయింట్‌ వరకు పోరాడితే పోయేదేమీ లేదులే అనుకుంటూ ముందుకు సాగిపోయాడు. చివరకు చిరస్మరణీయ విజయంతో చాంపియన్‌గా అవతరించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో రెండో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ 4 గంటల 2 నిమిషాల పోరాటంలో 2–6, 4–6, 6–4, 6–3, 7–6 (8/6)తో ఐదో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)పై గెలిచాడు. విజేత థీమ్‌కు 30 లక్షల డాలర్లు (రూ. 22 కోట్లు), రన్నరప్‌ జ్వెరెవ్‌కు 15 లక్షల డాలర్లు (రూ. 11 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి. కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన 27 ఏళ్ల థీమ్‌ 1949 తర్వాత యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో తొలి రెండు సెట్‌లు ఓడిపోయి, ఆ తర్వాత వరుసగా మూడు సెట్‌లు గెలిచి విజేతగా నిలిచిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. 1949లో యూఎస్‌ నేషనల్‌ చాంపియన్‌షిప్‌ పేరుతో జరిగిన టోర్నీ ఫైనల్లో పాంచో గొంజాలెజ్‌ (అమెరికా) తన సహచరుడు టెడ్‌ ష్రోడెర్‌పై ఈ తరహాలో గెలిచాడు. 1968 నుంచి ప్రొఫెషనల్‌ ఆటగాళ్లకు కూడా గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలు ఆడేందుకు అనుమతి ఇవ్వడంతో అప్పటి నుంచి టెన్నిస్‌లో ఓపెన్‌ శకం మొదలైంది.