అధికారిక లాంఛనాలతో ముగిసిన ఎస్పీ బాలు అంత్యక్రియలు


కోట్లాది మంది అభిమానులకు కన్నీటిని మిగిల్చి.. కానరాని లోకాలకు గాన గంధర్వుడు శాశ్వతంగా వెళ్లిపోయారు. పాటలతో ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగించిన ఆ స్వరమాంత్రికుడిని భూమాత తన గర్భంలో దాచుకుంది. అభిమానుల అశ్రునయనాలు, కుటుంబీకుల కన్నీటి ధారల మధ్య ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో శనివారం పూర్తయ్యాయి. అనారోగ్యంతో శుక్రవారం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన తర్వాత ఎస్పీ బాలు పార్థివదేహాన్ని కమదార్‌నగర్‌లోని ఆయన స్వగృహానికి తరలించారు. అక్కడ కొంతసేపు ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా తామరైపాక్కంలో ఉన్న బాలు సొంత వ్యవసాయ క్షేత్రానికి ఆయన పార్థివదేహాన్ని ప్రత్యేక వాహనంలో ఉంచి తరలించారు. ఆ వాహనాన్ని వేలాది మంది అనుసరించారు. దారిపొడవునా అభిమాన సందోహం ఆయనకు తుది వీడ్కోలు పలికారు. పలు చోట్ల వాహనాన్ని నిలిపివేసి పూలవర్షం కురిపించారు. దీంతో గంటలో వ్యవసాయ క్షేత్రానికి రావాల్సిన వాహనం మూడు గంటలు ఆలస్యంగా శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో చేరుకుంది. అప్పటికే వేలాది మంది జనం వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు.