అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)కు అనుబంధంగా ఏర్పడిన ‘జునూద్ అల్ ఖలీఫా ఫిల్ హింద్’ (జేకేహెచ్) మాడ్యూల్‌కు సంబంధించిన తొలి సమావేశం ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో జరిగిందని జాతీయ దర్యాప్తు సంస్థ నిర్ధారించింది. ఈ మీటింగ్‌కు నగరం నుంచి నఫీజ్ ఖాన్ వెళ్లాడని తేల్చింది. ఈ వివరాలను ఎన్ఐఏ తన అభియోగపత్రాల్లో పొందుపరిచింది. ఈ కేసులోనే తొమ్మది మందిని దోషులుగా ప్రకటిస్తూ ఢిల్లీలోని న్యాయస్థానం శనివారం తీర్పు ఇచ్చింది. వీరిలో హైదరాబాద్‌కు చెందిన నఫీజ్ ఖాన్ సహా ముగ్గురు ఉన్న విషయం విదితమే. 2016 జనవరిలో సిటీలో చిక్కిన నఫీస్ ఖాన్ ఈ మాడ్యుల్లో అత్యంత కీలకమైన ఉగ్రవాదిగా అధికారులు నిర్ధారించారు. సిరియా కేంద్రంగా అన్సార్ ఉల్ తౌహిద్ సంస్థను ఏర్పాటు చేసి, ఐసిస్ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న షఫీ ఆర్మర్ అలియాస్ యూసుఫ్ హింద్ (కర్ణాటకలోని భత్కల్ వాసి) ఆదేశాలతోనే ఈ మాడ్యుల్ పని చేస్తున్నట్లు ధ్రువీకరించారు. ఫేస్బుక్ ద్వారా ఇతడికి పరిచయమైన ముంబై నివాసి ముదబ్బిర్ ముస్తాఖ్ షేక్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రిజ్వాన్ అలియాస్ ఖాలిద్‌లకు ‘జునూద్’ విస్తరణ బాధ్యతల్ని అప్పగించాడు. సహరన్‌పూర్‌లో మీటింగ్... ఈ మాడ్యుల్‌కు చీఫ్‌గా వ్యవహరించిన ముదబ్బీర్ ఆన్లైన్ ద్వారానే ‘జునూద్’ను విస్తరించాడు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌కు చెందిన నఫీస్ ఖాన్‌తో 2014లో పరిచయం ఏర్పడింది. అబు జరార్ పేరుతో మాడ్యుల్లో చేరి, చాకచక్యంగా వ్యవహరిస్తున్న నఫీజ్ ఖాన్‌ను ఈ మాడ్యుల్ ఆర్థిక లావాదేవీలు పర్యవేక్షించే ఫైనాన్స్ చీఫ్‌గా ముదబ్బీర్ నియమించాడు. మాడ్యుల్‌ను దేశవ్యాప్తంగా విస్తరించాలనే ఉద్దేశంతో ముదబ్బీర్ 2015 జనవరిలో యూపీలో ఉన్న సహరన్పూర్ ప్రాంతంలో తొలి సమావేశం ఏర్పాటు చేశాడు. అప్పట్లో అక్కడ మత ఘర్షణలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని మీటింగ్‌కు ఎంచుకున్నారు.