ఇటాలియన్‌ ఓపెన్‌తో పునరాగమనం


ఏడు నెలల విరామం తర్వాత స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్, ప్రపంచ రెండో ర్యాంకర్‌ రాఫెల్‌ నాదల్‌ మళ్లీ కోర్టులోకి అడుగు పెట్టనున్నాడు. ఈనెల 14 నుంచి 21 వరకు రోమ్‌లో జరిగే ఇటాలియన్‌ ఓపెన్‌తో నాదల్‌ పునరాగమనం చేయనున్నాడు. ఫిబ్రవరిలో మెక్సికోలో జరిగిన అకాపుల్కో ఓపెన్‌లో నాదల్‌ చివరిసారి బరిలోకి దిగి విజేతగా నిలిచాడు. ఆ తర్వాత కరోనా మహమ్మారితో అంతర్జాతీయ టోర్నీలు నిలిచిపోయాయి. గత నెలలో న్యూయార్క్‌లో సిన్సినాటి ఓపెన్‌తో అంతర్జాతీయ టెన్నిస్‌ పునఃప్రారంభమైనా నాదల్‌ ఆ టోర్నీలో ఆడలేదు. న్యూయార్క్‌లో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో నాదల్‌ యూఎస్‌ ఓపెన్‌ టోర్నీకీ దూరంగా ఉన్నాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌కు సన్నాహక టోర్నీ అయిన ఇటాలియన్‌ ఓపెన్‌లో ఫెడరర్‌ మినహా టాప్‌–20 లోని 19 మంది ఆటగాళ్లు ఎంట్రీలు ఖరారు చేశారు. ఇదే టోర్నీ మహిళల సింగిల్స్‌ విభాగంలో టాప్‌–10లో నంబర్‌వన్‌ యాష్లే బార్టీ మినహా మిగతా తొమ్మిది మంది బరిలోకి దిగుతున్నారు.