కోవిడ్–19 ప్రభావం భారత్‌లో అన్ని రంగాలపైనా చూపిస్తోంది. ఇందుకు ఫార్మా మినహాయింపు ఏమీ కాదు. అయితే ఈ రంగంలో విభిన్న వాతావరణం నెలకొంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కొన్ని మందుల వినియోగం తగ్గితే, మరికొన్నిటి వాడకం పెరిగింది. ప్రధానంగా గ్యాస్ట్రో, న్యూరో, ఆప్తల్మాలజీ, డెంటల్, గైనిక్ సంబంధ ఔషధాల వినియోగం గణనీయంగా తగ్గింది. వైరస్ ఎక్కడ తమకు సోకుతుందోనన్న భయంతో ఆసుపత్రులకు రోగు లు వెళ్లకపోవడం, చికిత్సలు వాయిదా వేసుకోవడమే ఇందుకు కారణం. కార్డియో, డయాబెటిక్ వంటి మందుల అమ్మకాల్లో పెద్దగా మార్పులేదు. కోవిడ్ చికిత్సలో ఉపయోగించే రెమ్‌డెసివిర్, ఫావిపిరావిర్ తదితర ఔషధాల విక్రయాలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు ఈ మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి రోగనిరోధక శక్తిని పెంచుకునే పనిలో ప్రజలు నిమగ్నమయ్యారు. విటమిన్ల అమ్మకాలు ఎన్నడూ లేనంతగా జరుగుతున్నాయి. విటమిన్లపైనే ఫోకస్.. దాదాపు అన్ని ఫార్మా కంపెనీల పోర్ట్‌ఫోలియోలో విటమిన్లు కూడా ఉంటున్నాయి. మొత్తం ఫార్మా విక్రయాల్లో కోవిడ్ ముందు వరకు విటమిన్ల వాటా కేవలం 5–10 శాతమే. ఇప్పుడిది 30–40 శాతానికి చేరిందని ఆప్టిమస్ ఫార్మా డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘మల్టీ విటమిన్లు, బి, సి, డి, జింక్ ట్యాబ్లెట్ల అమ్మకాలు గతంలో లేనంతగా పెరిగాయి. కంపెనీలు మొదట శానిటైజర్లు, ఆ తర్వాత విటమిన్ల తయారీ వైపు మొగ్గుచూపాయి. అయితే వీటికి డిమాండ్ అధికమవడంతో ధర 20 శాతం దాకా పెరిగింది. ఇతర ఔషధాల అమ్మకాలు తగ్గినా.. కంపెనీలను విటమిన్లు ఆదుకుంటున్నాయి’ అని అన్నారు. కాగా, కోవిడ్ కారణంగా ఫార్మా రంగంలో ఉద్యోగుల తీసివేతలు జరగలేదని, కొత్త నియామకాలు కొనసాగుతూనే ఉన్నాయని ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ అభ్యర్థుల కోసం పరిశ్రమ ఎదురుచూస్తోందన్నారు.