రేట్ల సవరణ అవకాశాలు తక్కువే


పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తదుపరి భేటీలో వడ్డీ రేట్లను సవరించకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్‌బీఐ ఎంపీసీ ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు భేటీ కానుంది. అక్టోబర్‌ 1న ఎంపీసీ తన నిర్ణయాలను ప్రకటించనుంది. మరింత రేట్ల కోతకు అవకాశాలు ఉన్నప్పటికీ అవసరమైనప్పుడే వాటిని వినియోగిస్తామని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఇటీవలే ఓ సందర్భంలో చెప్పారు. దీంతో తదుపరి రేట్ల కోతపై అంచనాలు ఏర్పడ్డాయి. చివరి ఎంపీసీ భేటీ ఆగస్ట్‌లో జరగ్గా.. అప్పుడు కూడా పెరుగుతున్న ద్రవ్యోల్బణం రిస్క్‌లను దృష్టిలో ఉంచుకుని యథాతథ స్థితికే మొగ్గు చూపించింది. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ బలహీన స్థితిలో ఉందని ఆసందర్భంలో పేర్కొంది. జూలైలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.73 శాతంగా ఉంటే, ఆగస్ట్‌లో అతి స్వల్పంగా తగ్గి 6.69 శాతం స్థాయిలోనే ఉంది. కానీ, ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిల్లో.. గరిష్టంగా, కనిష్టంగా 2 శాతానికి మించకుండా చూడాలన్నది ఆర్‌బీఐ లక్ష్యం. అంటే ప్రస్తుతద్రవ్యోల్బణం ఆర్‌బీఐ గరిష్ట లక్ష్యమైన 6 శాతానికి పైనే ఉండడం గమనార్హం. నిపుణుల అంచనాలు.. ‘‘యథాతథ స్థితికే ఆర్‌బీఐ మొగ్గు చూపించొచ్చు. అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఈ విడత రేట్ల కోత ఉంటుందని నేను అయితే భావించడం లేదు’’ అని యూనియన్‌ బ్యాంకు ఎండీ, సీఈవో రాజ్‌కిరణ్‌ రాయ్‌ తెలిపారు. రేట్ల కోతకు అవకాశం ఉందని, అయితే, వచ్చే ఫిబ్రవరిలో అది సాధ్యపడొచ్చన్నారు. డిసెంబర్‌ నాటికి ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందని, మంచి పంటల ఉత్పాదకత కారణంగా రేట్ల కోతకు అవకాశం ఫిబ్రవరిలో కలగొచ్చని చెప్పారు. రెపో, రివర్స్‌ రెపో రేట్లతో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చని.. స్థూల ఆర్థిక గణాంకాలను ఆర్‌బీఐ నిశితంగా పరిశీలించొచ్చని కోటక్‌ మహీంద్రా బ్యాంకు కన్జ్యూమర్‌ బ్యాంకింగ్‌ ప్రెసిడెంట్‌ శక్తిఏకాంబరం అన్నారు.