బిహార్ పోరు : మార్కెట్ల జోరు


దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభంలోనే వరుస ఆరు రోజుల నష్టాలకు చెక్ చెప్పిన సూచీలు లాభాలతో కళకళ లాడుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 657 పాయింట్లు లాభపడి 37212 వద్ద, నిఫ్టీ192 పాయింట్లు ఎగిసి10,994 వద్ద కొనసాగుతున్నాయి. రెండు నెలల కనిష్టం నుంచి ఎగిసిన కీలక సూచీలు రెండు ప్రధాన మద్దతు స్థాయిలకు ఎగువన ట్రేడ్ అవుతున్నాయి. ఎన్నికల సంఘం మూడు దశల్లో బిహార్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటన నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. తద్వారా అక్టోబర్‌ ఎఫ్ అండ్ వో సిరీస్‌కు శుభారంభాన్నిచ్చాయి. ప్రధానంగా ఐటీ షేర్ల లాభాలు మార్కెట్లకు మద్దతునిస్తున్నాయి.మెటల్, ఆటో స్టాక్స్ కూడా లాభాపడుతున్నాయి. హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్ర తోపాటు, మైండ్ ట్రీ , ఇన్ఫోసిస్ కొనుగోళ్ల ధోరణి కనిపిస్తోంది. ఇండస్ ఇండ్ బ్యాంకు, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, మారుతీ, ఓఎన్జీసీ, రిలయన్స్, పవర్ గ్రిడ్ లాభాల్లో ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో కోల్ ఇండియా, టైటాన్ కంపెనీ, కొటక్ మహీంద్రా, బీపీసీఎల్, హిందాల్కో ఉన్నాయి అటు ఈక్విటీ మార్కెట్ల మద్దతు, డాలర్ బలహీనత నేపథ్యంలో దేశీయ కరెన్సీ రూపాయ కూడా సానుకూలంగా ఉంది. డాలరు మారకంతో రూపాయి 16 పైసలు లాభపడి రూ. 73.73 వద్ద కొనసాగుతోంది.