హైదరాబాద్‌కి వచ్చే ప్రముఖులు సందర్శించాలని సీఎం ఆకాంక్ష  ప్రముఖులు ఢిల్లీకి వచ్చినప్పుడు అక్కడి మహాత్మాగాంధీ సమాధిని సందర్శించి, నివాళులర్పించినట్లే హైదరాబాద్‌కు రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు వచ్చిన సందర్భాల్లో తెలంగాణ అమరవీరుల స్మారకం వద్ద నివాళులు అర్పించే సంప్రదాయం రావాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్ష అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. హుస్సేన్‌సాగర్‌ వద్ద నిర్మిస్తున్న స్మారకం పనులను శుక్రవారం అధికారులతో కలసి మంత్రి పరిశీలించారు. ఖర్చుకు వెనకాడకుండా దీన్ని అద్భుతంగా నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. లుంబినీ పార్కు సమీపంలో ఇది రూపుదిద్దుకుంటున్నందున భవిష్యత్తులో ఇక్కడికి పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో 350 కార్లు, 600 ద్విచక్ర వాహనాలు నిలిపే సామర్థ్యంతో పార్కింగ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. స్మారకం మొదటి అంతస్తులో మ్యూజియం, ఫొటో గ్యాలరీ, సమావేశ మందిరం, ఆర్ట్‌ గ్యాలరీ ఉంటాయని వివరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానం చేసుకున్న తీరు అక్కడి ఛాయా చిత్ర ప్రదర్శన కళ్లకు కడుతుందని చెప్పారు. రెండో అంతస్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమావేశాల నిర్వహణకు కన్వెన్షన్‌ సెంటర్‌ ఉంటుందన్నారు. మూడో అంతస్తులో రెస్టారెంట్లు ఉంటాయని పేర్కొన్నారు. మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ స్మారక భవనం రూపుదిద్దుకుంటోందన్నారు. ఆరు నెలల్లో ఇది సిద్ధమవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి, రోడ్లు భవనాల శాఖ ఈఎన్‌సీ గణపతి రెడ్డి, ఎస్‌ఈ పద్మనాభరావు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.