నేడు రష్యా గ్రాండ్‌ప్రి రేసులో నెగ్గితే షుమాకర్‌ రికార్డు సమం


ఫార్ములావన్‌ రేసింగ్‌ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన మైకేల్‌ షుమాకర్‌ (91 టైటిల్స్‌) పేరిట ఉన్న రికార్డును సమం చేయడానికి మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ మరింత చేరువయ్యాడు. శనివారం జరిగిన రష్యా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌ సెషన్‌లో హామిల్టన్‌ అందరికంటే వేగంగా ఒక నిమిషం 31.304 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును ‘పోల్‌ పొజిషన్‌’తో ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో హామిల్టన్‌కు పోల్‌ పొజిషన్‌ దక్కడం ఎనిమిదోసారి కావడం విశేషం. ఈ ఏడాది ఆరు టైటిల్స్‌ నెగ్గిన బ్రిటన్‌ డ్రైవర్‌ హామిల్టన్‌ రష్యా గ్రాండ్‌ప్రిలోనూ నెగ్గితే 91వ టైటిల్‌తో షుమాకర్‌ రికార్డును సమం చేస్తాడు. వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌) రెండో స్థానం నుంచి... బొటాస్‌ (మెర్సిడెస్‌) మూడో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు.