బీసీసీఐ ఏజీఎం వాయిదా


భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) వాయిదా పడింది. అతి ముఖ్యమైన ఈ మీటింగ్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించే వీలు లేకపోవడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ కార్యదర్శి జై షా తమ నిర్ణయాన్ని అనుబంధ, రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు తెలిపారు. నిబంధనల ప్రకారం ఏటా సెప్టెంబర్‌ 30లోపు ఏజీఎం నిర్వహించాలి. ఇపుడున్న కరోనా పరిస్థితుల్లో ఆలోపు నిర్వహించడం కుదరట్లేదు. ఈ అంశంపై న్యాయ సలహా తీసుకున్న మీదటే ఏజీఎంను వాయిదా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెలాఖరులోపు తప్పనిసరిగా ఏజీఎం నిర్వహించాల్సిన అవసరమైతే లేదని, తదుపరి ఎప్పుడు ఏజీఎం ఉంటుందనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని జై షా వివరించారు. ఐపీఎల్‌ తదితర కీలకాంశాలపై చర్చించేందుకు బోర్డు గతంలో వర్చువల్‌ మీటింగ్‌ (ఎక్కడివారక్కడే ఉండి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం) నిర్వహించింది. చివరిసారిగా బోర్డు ఏజీఎం గతేడాది అక్టోబర్‌లో జరిగింది. అప్పుడే మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.