రాష్ట్ర ప్రయోజనాల కోసం బాసటగా ఉంటామని వెల్లడి


రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విషయంలో సీఎం కేసీఆర్‌ ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. అందుకు తాము బాసటగా నిలుస్తామని తెలిపారు. కరీంనగర్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జీఎస్టీ వల్ల రాష్ట్రం వేల కోట్ల రూపాయలు నష్టపోయిందని పేర్కొన్నారు. రాష్ట్రాలకు ఇచ్చే నిధులు ఇవ్వకుండా కేంద్రం అప్పులు తీసుకోవాలని సూచించడం దారుణమన్నారు. విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే బీజేపీ కుట్రలను ఎండగట్టేందుకు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రైతుల కోసం సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు బాగున్నాయని కొనియాడారు. కొత్త రెవెన్యూ చట్టంలో ఉన్న కొన్ని లొసుగులను సవరించాలని, ఎల్‌ఆర్‌ఎస్‌ నుంచి సామాన్యులను మినహాయించాలని డిమాండ్‌ చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక ఉద్యమ సమయంలో ఢిల్లీలో చెలరేగిన ఘర్షణలకు సంబంధించి సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, ఇతర నేతలను నిందితులంటూ పోలీసులు కేసులు నమోదు చేయడం వెనుక బీజేపీ కుట్రలు ఉన్నాయని ఆరోపించారు. తక్షణమే ఆ అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.