సఫారీ క్రికెట్‌ బోర్డుపై విచారణ


దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు (సీఎస్‌ఏ)పై ఆ దేశపు స్పోర్ట్స్‌ కాన్ఫెడరేషన్, ఒలింపిక్‌ కమిటీ (ఎస్‌ఏఎస్‌సీఓసీ) విచారణ జరపనుంది. బోర్డు అవకతవకలు, అనుచిత కార్యకలాపాలకు పాల్పడినట్లు వచ్చిన అరోపణలపై విచారణ చేపట్టామని ఎస్‌ఏఎస్‌సీఓసీ తెలిపింది. నల్లజాతీయులపై వివక్ష, అవినీతి ఆరోపణలతో ప్రభుత్వం సఫారీ బోర్డును గురువారం రద్దు చేసింది. దీంతో ఇప్పుడు సీఎస్‌ఏ అధికారులెవరూ రోజువారీ కార్యకలాపాల్లో తలదూర్చడానికి వీలులేదు. సీఎస్‌ఏ మాజీ సీఈఓ తబంగ్‌ మోన్రో గత నెల క్రికెట్‌ బోర్డు అక్రమాలు, అవకతవకలకు పాల్పడుతుందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఫొరెన్సిక్‌ నివేదికలు కూడా ఇవే ధ్రువీకరిస్తున్నాయని మండిపడ్డారు. తదనంతర పరిణామాలతో బోర్డు తాత్కాలిక సీఈఓ జాక్వెస్‌ ఫాల్, అధ్యక్షుడు క్రిస్‌ నెంజానిలు రాజీనామా చేశారు. మేటి ఆటగాళ్లు కూడా సీఎస్‌ఏ పనితీరుపై విమర్శలు చేశారు. ఈ నెల 5న జరగాల్సిన సీఎస్‌ఏ సర్వసభ్య సమావేశం ఏకపక్షంగా వాయిదా వేయడాన్ని ఆటగాళ్లు తప్పుబట్టారు.