లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శక-నిర్మాత అనురాగ్ కశ్యప్‌కు పలువురు బాలీవుడ్ నటులు మద్దుతగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అనురాగ్ కశ్యప్‌కు మద్దతిచ్చారు. అనురాగ్ కశ్యప్ అత్యంత 'సున్నితమైన, భావోద్వేగానికి గురయ్యే వ్యక్తి' అని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. అనురాగ్ కశ్యప్ ఎవరినీ బాధపెట్టడం తాను ఎప్పుడూ చూడలేదని, కనీసం వినలేదని ఆయన అన్నారు. ఈ మేరకు రామ్ గోపాల్ వర్మ ‘నాకు తెలిసిన అనురాగ్ కశ్యప్ చాలా సున్నితమైన, భావోద్వేగాలు కల వ్యక్తి. నాకు అతడు గత 20 ఏళ్లుగా తెలుసు. ఇన్నేళ్ల కాలంలో ఆయన ఎవరినీ బాధపెట్టడం గురించి నేను ఎప్పుడూ చూడలేదు, వినలేదు.. కనుక ప్రస్తుతం జరిగే దాని గురించి స్పష్టంగా చెప్పలేను’ అంటూ వర్మ ట్వీట్ చేశారు. అయితే దర్శకుడు అనురాగ్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని నటి పాయల్ శనివారం ఆరోపించిన విషయం తెలిసిందే. పలువురు బాలీవుడ్ ప్రముఖులు అనురాగ్ కశ్యప్‌కు మద్దతుగా వచ్చారు. తాప్సీ, అనుభవ్ సిన్హా, సుర్వీన్ చావ్లా, కల్కి కోచ్లిన్, ఆర్తి బజాజ్ వంటి ప్రముఖులు అందరూ అనురాగ్ కశ్యప్‌ను సమర్థించారు. తాప్సీ అనురాగ్ కశ్యప్ తనకు తెలిసిన అతిపెద్ద ఫెమినిస్ట్ అనగా.. అనుభావ్ సిన్హా ‘మీటూ ఉద్యమాన్ని మహిళల గౌరవం తప్ప మరే ఇతర కారణాల కోసం దుర్వినియోగం చేయరాదని' అభిప్రాయపడ్డారు. ఇక అనురాగ్ మాజీ భార్య కల్కి కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయనకు మద్దతు తెలిపారు.