ఇన్నేళ్లయినా సీబీఐ ఏమీ తేల్చలేదు


ఆ మచ్చే లేకుంటే మహారాష్ట్ర కుస్తీ వీరుడు నర్సింగ్‌ యాదవ్‌ ‘డబుల్‌ ఒలింపియన్‌’ రెజ్లర్‌ అయ్యేవాడు. కానీ 2016 రియో ఒలింపిక్స్‌కు ముందు నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో అతన్ని తప్పించడంతోపాటు నాలుగేళ్ల నిషేధం కూడా విధించారు. ఈ శిక్షాకాలం పూర్తవడంతో మళ్లీ కసరత్తు ప్రారంభించిన నర్సింగ్‌ తనకు జరిగింది ముమ్మాటికీ అన్యాయమనే వాపోతున్నాడు. తనకు తెలిసి ఏ తప్పూ చేయలేదని, ఏ ఉత్ప్రేరకాన్ని తీసుకోలేదని, తిన్న ఆహారం, తాగునీరు ద్వారానే తనను కావాలని ఇరికించి ఒలింపిక్స్‌ ఆశల్ని చిదిమేశారని విచారం వ్యక్తం చేశాడు. ఇన్నేళ్లయినా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దోషులెవరనేది తేల్చలేదని అసహనం వ్యక్తం చేశాడు.