కరోనాతో డీఎస్‌ఐ మృతి

 


 సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని మాదాపూర్‌ పోలీసుస్టేషన్‌లో డిటెక్టివ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (డీఎస్‌ఐ)గా పనిచేస్తున్న అబ్బాస్‌ అలీ(57) కరోనాతో మృతి చెందారు. వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం బొంపల్లికి చెందిన అబ్బాస్‌ అలీ 1984లో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు. తర్వాత హెడ్‌ కానిస్టేబుల్‌గానూ రాణించాడు. ఎస్‌ఐగా ప్రమోషన్‌ వచ్చిన అనంతరం అంబర్‌ పేట్‌లో శిక్షణ పొంది 10 నెలల క్రితం మాదాపూర్‌ పీఎస్‌లో డీఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టారు. గత మంగళవారం ఆయనకు నీరసంగా ఉండటంతో మాదాపూర్‌లోని మెడికోవర్‌ ఆస్పత్రిలో టెస్ట్‌ చేయగా కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. దీంతో అదే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజుల వ్యవధిలోనే ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ రావడంతో పరిస్థితి విషమించి శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఆయనకు భార్య, ఐదుగురు కొడుకులు, కూతురు ఉంది. మాదాపూర్‌ పీఎస్‌లో ఇప్పటికే పలువురు సిబ్బందికి కరోనా సోకినా అందరూ కోలుకున్నారు.