రాష్ట్రాన్ని ముంచెత్తిన జడివాన.. జనజీవనం అతలాకుతలం


మేఘం ఆగమాగం.. మన్నూ, మిన్నుకు ఏకధారగా కురిసిన ఎడతెరిపిలేని వర్షం.. ప్రజలను జడిపించింది. వాగులు, వంకలను ముంచెత్తింది. దీంతో పల్లెల మధ్య రాకపోకలు స్తంభించాయి. అల్పపీడనం అనల్ప ప్రభావం చూపింది. ఆసుపత్రులకు బయలుదేరిన నిండు గర్భిణులు వాగులు దాటలేక నరకయాతన పడ్డారు. స్కూలుకని వెళ్తున్న స్వీపర్‌ వరదనీటిలో గల్లంతయ్యాడు. చేపలవేటకు వెళ్లిన జాలరులపై జాలి కూడా చూపలేదు. రహదారులు కొట్టుకు పోయాయి.. కాలనీలు జలమయమయ్యాయి.. రాష్ట్రం మోస్తరు, భారీ, అతి భారీ వర్షాల సంగమ మైంది. రాష్ట్రంలోని 22 మండలాల్లో అతి భారీ, 43 మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో 14 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 11 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మొత్తానికి శనివారం కురిసిన భారీ వర్షానికి రాష్ట్రవ్యాప్త జనజీవనం అతలాకుతలమైంది.