తొలి రౌండ్‌లోనే ఓడిన తొమ్మిదో సీడ్‌ యోహానా కొంటా, వీనస్


ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ సంచలనాలతో మొదలైంది. ఆదివారం ప్రారంభమైన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్‌ విభాగంలో తొమ్మిదో సీడ్‌ యోహానా కొంటా (బ్రిటన్‌), ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా), 17వ సీడ్‌ అనెట్‌ కొంటావె (ఎస్తోనియా), 24వ సీడ్‌ డయానా యాస్‌ట్రెమ్‌స్కా (ఉక్రెయిన్‌)... పురుషుల సింగిల్స్‌ విభాగంలో 11వ సీడ్‌ డేవిడ్‌ గాఫిన్‌ (బెల్జియం), ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ ఆండీ ముర్రే (బ్రిటన్‌) తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. అమెరికా టీనేజ్‌ సంచలనం, 16 ఏళ్ల కోరి గాఫ్‌ గంటా 41 నిమిషాల్లో 6–3, 6–3తో యోహానా కొంటాను బోల్తా కొట్టించి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. కరోలినా షిమెద్లోవా (స్లొవేకియా) 6–4, 6–4తో వీనస్‌పై... దరియా గావ్రిలోవా (ఆస్ట్రేలియా) 6–4, 6–3తో యాస్‌ట్రెమ్‌స్కాపై, కరోలినా గార్సియా (ఫ్రాన్స్‌) 6–4, 3–6, 6–4తో కొంటావెపై గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. 1997 నుంచి ఈ టోర్నీలో ఆడుతోన్న 40 ఏళ్ల వీనస్‌ వరుసగా మూడో ఏడాది తొలి రౌండ్‌లోనే వెనుదిరగడం గమనార్హం. ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో టాప్‌ సీడ్‌ హలెప్‌ (రొమేనియా) 6–4, 6–0తో సొరిబెస్‌ టోర్మో (స్పెయిన్‌)పై, మాజీ నంబర్‌వన్, పదో సీడ్‌ అజరెంకా (బెలారస్‌) 6–1, 6–2తో డాంకా కొవినిచ్‌ (మాంటెనిగ్రో)పై, 16వ సీడ్‌ ఎలీజ్‌ మెర్‌టెన్స్‌ (బెల్జియం) 6–2, 6–3తో గాస్‌పర్యాన్‌ (రష్యా)పై విజయం సాధించారు.