మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో కేసీఆర్‌ భేటీ


తెలంగాణలో మరో మినీ ఎన్నికల సందడి మొదలైంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషనతో‌ పాటు పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘం కసరత్తులు చేస్తోంది. మరోవైపు ఎన్నికల్లో పోటీకి ఆశావాహులు సిద్ధంగా ఉండగా.. గెలుపు గుర్రాలను అన్వేషించే పనిలో ప్రధాన పార్టీలు పడ్డాయి. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ దృష్టిసారించింది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మంత్రి కేటీఆర్‌ పార్టీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో పార్టీ నాయకత్వం ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. దీనిలో భాగంగానే ఇప్పటికే రంగంలోకి దిగిన కేటీఆర్‌ గ్రేటర్‌ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో విడతల వారిగా సమీక్షలు నిర్వహించారు. ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, డబుల్‌ బెడ్‌రూంల పంపిణీని వేగవంతం చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం పార్టీ ఎమ్మెల్యేలు, మేయర్లతో సమావేశం నిర్వహించారు.