ప్యాసింజర్ వాహన అమ్మకాలు తొమ్మిది నెలల తర్వాత తొలిసారి ఈ ఆగస్ట్‌లో వృద్ధిని సాధించాయి. లాక్డౌన్ సడలింపులకు తోడు డిమాండ్ ఊపందుకోవడంతో ఆగస్ట్‌లో మొత్తం 2,15,916 ప్యాసింజర్ వాహన విక్రయాలు జరిగాయి. గతేడాది ఇదే నెలలో అమ్ముడైన 1,89,129 యూనిట్లతో పోలిస్తే ఇవి 14.16శాతం అధికమని ఇండియా అటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్స్(సియామ్) తెలిపింది. సియామ్ గణాంకాల ప్రకారం... ప్యాసింజర్ కార్ల అమ్మకాల్లో 14.13శాతం వృద్ది నమోదైంది. ఈ గతేడాదిలో ఇదే ఆగస్ట్‌లో 1,09,277 యూనిట్ల విక్రయాలు జరగ్గా, ఈసారి 1,24,715 యూనిట్లకు పెరిగాయి. సమీక్షా కాలంలో యుటిలిటి వాహన అమ్మకాలు కూడా పెరిగాయి. ఈ విభాగంలో మొత్తం 81,842 యూనిట్లు విక్రయాలు జరగ్గా, గతేడాది ఇదే నెలలో 70,837 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. మోటర్‌సైకిల్ అమ్మకాల్లో 10శాతం వృద్ధిని సాధించాయి. అయితే స్కూటర్, త్రీ–వీలర్స్ విక్రయాలు క్షీణతను చవిచూశాయి. ముఖ్యంగా త్రీ–వీలర్స్ విభాగంలో విక్రయాలు ఏకంగా 75.29 శాతం క్షీణతను చవిచూశాయి. గతేడాది నెలలో 58,818 యూనిట్ల అమ్మకాలు జరగ్గా, ఈ నెలలో 14,534 యూనిట్లకు పరిమితమయ్యాయి.