తొలి వన్డేలో ఇంగ్లండ్‌ ఓటమి


చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న ఇంగ్లండ్‌కు వన్డే సిరీస్‌లో మాత్రం శుభారంభం లభించలేదు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన తొలి వన్డేలో ప్రపంచ చాంపియన్‌ ఇంగ్లండ్‌ 19 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. 295 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు చేసి పరాజయం పాలైంది. జేసన్‌ రాయ్‌ (3), జో రూట్‌ (1), బట్లర్‌ (1), మొయిన్‌ అలీ (6) విఫలమయ్యారు. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ స్యామ్‌ బిల్లింగ్స్‌ (110 బంతుల్లో 118; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ... ఓపెనర్‌ బెయిర్‌స్టో (107 బంతుల్లో 87; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఇన్నింగ్స్‌ ఇంగ్లండ్‌ను గెలిపించలేకపోయాయి. బిల్లింగ్స్‌తో కలిసి ఐదో వికెట్‌కు 113 పరుగులు జోడించాక బెయిర్‌స్టో అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌ బిల్లింగ్స్‌కు సహకరించడంలో విఫలమయ్యారు. దాంతో ఇంగ్లండ్‌కు ఓటమి ఖాయమైంది.