స్టోక్స్‌ ఆడతాడో... లేదో...!


ఈ సీజన్‌ ఐపీఎల్‌లో ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఆడేది అనుమానమేనని రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు హెడ్‌ కోచ్‌ మెక్‌డొనాల్డ్‌ తెలిపారు. న్యూజిలాండ్‌లో ఉండే స్టోక్స్‌ తండ్రి క్యాన్సర్‌ బారిన పడ్డారు. దీంతో గత నెల పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు. ‘మేం ఆలోచించేది స్టోక్స్‌ కుటుంబం గురించే! వాళ్లిపుడు క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే మేం స్టోక్స్‌ వెంటే ఉండాలనుకుంటున్నాం. ఆడే విషయం, ఈ సీజన్‌కు అందుబాటులో ఉండే అంశం అతనికే వదిలేశాం. కావాల్సినంత సమయం ఇచ్చాం. అయితే ఇప్పుడే ఆడేది లేనిది కచ్చితంగా చెప్పలేం. స్టోక్స్‌ నుంచి సమాచారం వస్తేగానీ దేన్నీ నిర్ధారించలేం. దీనిపై ప్రస్తుతానికి రెండో ఆలోచనైతే ఏమీ లేదు’ అని మెక్‌డొనాల్డ్‌ తెలిపారు. అయితే స్టీవ్‌ స్మిత్‌ ఆడే అవకాశాలున్నాయని చెప్పారు. జన్మతః న్యూజిలాండ్‌ వాసి అయిన స్టోక్స్‌ ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కానీ అతని తల్లిదండ్రులు మాత్రం కివీస్‌లోనే ఉన్నారు. ప్రస్తుతం స్టోక్స్‌ న్యూజిలాండ్‌లోని తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాడు. యూఏఈకి తరలిన ఈ సీజన్‌ ఐపీఎల్‌కు ఈ నెల 19న గంట మోగనుంది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్‌ తలపడతాయి.