ఒకే గేమ్‌ కోల్పోయి సెమీఫైనల్లోకి


ఏడేళ్ల విరామం తర్వాత ప్రపంచ మహిళల టెన్నిస్‌ వరల్డ్‌ మాజీ నంబర్‌వన్‌ విక్టోరియా అజరెంకా ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. యూఎస్‌ ఓపెన్‌ టోర్నీలో ఈ బెలారస్‌ ‘మమ్మీ’ క్వార్టర్‌ ఫైనల్లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. 16వ సీడ్‌ ఎలీసె మెర్‌టెన్స్‌ (బెల్జియం)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 27వ ర్యాంకర్‌ అజరెంకా కేవలం ఒక్క గేమ్‌ మాత్రమే కోల్పోయి తన ప్రత్యర్థిని 6–1, 6–0తో చిత్తుగా ఓడించింది. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మెర్‌టెన్స్‌ తన సర్వీస్‌ను ఒక్కసారీ నిలబెట్టుకోలేకపోయింది. ఆమె సాధించిన ఒక్క గేమ్‌ కూడా తొలి సెట్‌లో అజరెంకా సర్వీస్‌ను బ్రేక్‌ చేయడం ద్వారానే రావడం గమనార్హం. మ్యాచ్‌ మొత్తంలో అజరెంకా మూడు ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. నెట్‌ వద్దకు 10 సార్లు దూసుకొచ్చి ఎనిమిదిసార్లు పాయింట్లు సాధించింది. కేవలం 11 అనవసర తప్పిదాలు చేసిన ఆమె 21 విన్నర్స్‌ కొట్టింది. పునరాగమనం... 2016 డిసెంబరులో మగ బిడ్డకు జన్మనిచ్చిన అజరెంకా ఏడు నెలలపాటు ఆటకు విరామం ఇచ్చింది. 2017 జూలైలో వింబుల్డన్‌ టోర్నీ ద్వారా గ్రాండ్‌స్లామ్‌లలో పునరాగమనం చేసింది. ఆ తర్వాత ఆమె మరో ఏడు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో పాల్గొన్నా మూడో రౌండ్‌ను దాటలేకపోయింది.