రాముడికి పట్టాభిషేకం.. హరీష్‌రావు ఎక్కడా..?


తెలంగాణ ఉద్యమ చరిత్రలో కల్వకుంట్ల కుటుంబానికి ప్రత్యేక స్థానముంది. ఆరు దశాబ్ధాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కే చంద్రశేఖర్‌రావు నిర్వహించిన మలిదశ పోరాటం ప్రజానీకం మరువలేనిది. కేవలం స్వరాష్ట్రమే ధ్వేయంగా 2001 ఏప్రిల్‌ 27న టీఆర్‌ఎస్‌ పార్టీ స్థాపన మొదలు.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వరకు బిగించిన పిడికిలి వదలకుండా పోరాటం చేసిన నేతగా, రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా కేసీఆర్‌ కీర్తి గడించారు. వలస పాలకుల పెత్తనానికి చరమగీతం పాడుతూ ఉద్యమాన్ని ముందుండి నడిపించి, మూడుకోట్ల తెలంగాణ పౌరుల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన గులాబీ బాస్‌గా ప్రజల గుండెల్లో చోటుదక్కించుకున్నారు. ఇక ఈ క్రమంలోనే 2014లో జరిగిన ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్‌.. ఆ తరువాత రాజకీయంగా తెలంగాణ గడ్డపై తనకు ఎదురేలేదని నిరూపించుకున్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగిన ప్రతిపక్షాలకు కనీసం డిపాజిట్లు కూడా దక్కకుండా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ గులాబీ జెండాను రెపరెపలాడిస్తున్నారు. సంక్షేమ పథకాలే బలంగా రెండోసారి ఎన్నికల బరిలో నిలిచిన కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు నీరాజనాలు పలికారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా బంపర్‌ మెజార్టీ అందించారు. తెలంగాణలో తనకు ఎవరూ సాటిలేరని మరోసారి నిరూపించారు.