అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడి


ప్రస్తుతం ఉన్న గోదాములకు అదనంగా మరో 40 లక్షల మెట్రిక్‌ టన్నుల అదనపు సామర్థ్యంతో మరిన్ని గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. వీటి నిర్మాణానికి ఇప్పటికే మార్కెటింగ్‌ శాఖ పూర్తిస్థాయి నివేదికను ఇచ్చిందని, త్వరలోనే ఈ ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు పంపి పనులు వేగవంతం చేస్తామని తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో సోమవారం టీఆర్‌ఎస్‌ సభ్యులు పెద్ది సుదర్శన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి నిరంజన్‌ రెడ్డి సమాధానం ఇచ్చారు. గోదాముల నిర్మాణానికి అవసరమైన స్థలాలు చాలా చోట్ల గుర్తించడంతో భూముల సమస్య లేదని స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పాటు కాకముందు కేవలం 4.17లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములు 176 మాత్రమే ఉండేవని, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 17.20 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం ఉన్న 452 గోదాములను నిర్మించినట్లు వివరించారు. దీంతోపాటు మరో 40 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో గోదాముల నిర్మాణ ప్రతిపాదనలు ఉన్నాయని, ప్రతి ఒక కోల్డ్‌ స్టోరేజీ నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.