హేమంత్‌ హత్య : అసలు తప్పెవరిది?


గచ్చిబౌలిలో కిడ్నాప్‌ అయి..సంగారెడ్డి జిల్లా మల్కాపూర్‌ శివారు కిష్టాయిగూడెం వద్ద విగత జీవిగా మారిన హేమంత్‌ కుమార్‌ హత్యోందంతం ఇటు పౌరుల బాధ్యతారాహిత్యాన్ని ఎత్తిచూపుతూ...అటు పోలీసింగ్‌ విధానం మారాలనే పాఠాన్నీ చెబుతోంది. గోపన్‌పల్లి తండా చౌరస్తా వద్ద కార్లు ఆగడం..వాటిలో పెనుగులాట జరిగిన తతాంగాన్ని సెల్‌ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు చిత్రీకరించేందుకు ఆసక్తి చూపిన జనాలు..కాస్త మానవత్వం ప్రదర్శించి..అడ్డుకుని..పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే ఈ దారుణ ఘటన జరిగి ఉండేది కాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 3.42 గంటల ప్రాంతంలో మూడు కార్లు ఆగిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలకు చిక్కిన వాటిని పరిశీలిస్తే అవంతి రెడ్డి కుటుంబ సభ్యుల వద్ద ఎటువంటి దాడి చేసే ఆయుధాలు లేవు. అయితే అక్కడ జరిగిన గలాటాను జనాలు చూశారే తప్ప ఎవరూ ఆపేందుకు ప్రయత్నించకపోవడంతో వారు మరింత రెచ్చిపోయారు. ఇలా దాదాపు 20 నిమిషాలకు పైగానే గడబిడ జరగడం..హేమంత్‌పై చేయిచేసుకోవడం జరిగింది. ఎలాగోలాగూ వారి నుంచి తప్పించుకొని హేమంత్‌ కుమార్‌ తెల్లాపూర్‌ రోడ్డువైపు పరుగులు తీశాడు. దీంతో అప్పటికే కిరాయి హంతకులు బిచ్చు యాదవ్, ఎరుకల కృష్ణలు కూర్చొని ఉన్న స్విఫ్ట్‌ కారు (టీఎస్‌08 ఈటీ 3031)ను డ్రైవ్‌ చేసిన అవంతి రెడ్డి మేనమామ యుగంధర్‌ రెడ్డి చేజ్‌ చేసి మరీ పట్టుకున్నారు. ఆ తర్వాత కారులో ఎక్కించుకొని తెల్లాపూర్‌ మీదుగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) ఎక్కి పటాన్‌చెరు వద్ద ఆగి అటు నుంచి జహీరాబాద్‌ వెళ్లారు.