కోవిడ్–19 వ్యాక్సిన్ విషయంలో భారత్‌లో పెద్ద ముందడుగు పడింది. ఈ ఏడాదే రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్–వి వ్యాక్సిన్ దేశంలో అడుగు పెట్టనుంది. ఈ వ్యాక్సిన్ మూడవ దశ ఔషధ పరీక్షలతోపాటు పంపిణీకై హైదరాబాద్ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) మధ్య ఒప్పందం కుదిరింది. అలాగే భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి లభించిన తర్వాత రెడ్డీస్‌కు 10 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఆర్డీఐఎఫ్ సరఫరా చేయనుంది. పరీక్షలు విజయవంతం అయి, వ్యాక్సిన్ నమోదు ప్రక్రియ పూర్తి అయితే.. ఈ ఏడాది చివరి నుంచే దేశంలో వ్యాక్సిన్ల డెలివరీ ఉండే అవకాశం ఉందని రెడ్డీస్ బుధవారం ప్రకటించింది. రష్యాకు చెందిన గమలేయ నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ స్పుత్నిక్–వి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. నమ్మదగిన ఎంపిక... రష్యాలో 25 ఏళ్లుగా డాక్టర్ రెడ్డీస్‌కు సుస్థిర, గౌరవప్రద స్థానం ఉందని ఆర్డీఐఎఫ్ సీఈవో కిరిల్ దిమిత్రీవ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. హ్యూమన్ ఎడినోవైరస్ డ్యూయల్ వెక్టర్ ప్లాట్‌ఫాంపై ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేశామని, ఇది సురక్షితమైందని వివరించారు. వ్యాక్సిన్‌ను భారత్‌కు తీసుకు వచ్చేందుకు ఆర్డీఐఎఫ్తో భాగస్వామ్యం సంతోషంగా ఉందని డాక్టర్ రెడ్డీస్ కో–చైర్మన్, ఎండీ జి.వి.ప్రసాద్ అన్నారు. మొదటి, రెండవ దశ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని గుర్తు చేశారు. భద్రత, సమర్థత తెలుసుకునేందుకు, అలాగే భారత నియంత్రణ సంస్థల ప్రమాణాలకు అనుగుణంగా మూడవ దశ ఔషధ పరీక్షలు దేశంలో జరుపనున్నట్టు వెల్లడించారు. భారత్‌లో కోవిడ్–19పై పోరులో స్పుత్నిక్–వి వ్యాక్సిన్ నమ్మదగిన ఎంపిక అని చెప్పారు.