వారాంతాన దేశ, విదేశీ మార్కెట్లో స్వల్ప నష్టాలతో ముగిసిన బంగారం, వెండి ధరలు మరోసారి వెనకడుగు వేస్తున్నాయి. కన్సాలిడేషన్ బాటలో అటు న్యూయార్క్ కామెక్స్‌లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. 78 క్షీణించి రూ. 50,469 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 346 నష్టంతో రూ. 61,330 వద్ద కదులుతోంది. ఇటీవల ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 94 దిగువకు పుంజుకోవడం, అమెరికా ప్రభుత్వ ప్యాకేజీపై కొనసాగుతున్న అనిశ్చితులు వంటి అంశాలు పసిడి ధరలకు చెక్ పెడుతున్న విషయం విదితమే. సెప్టెంబర్‌లో యూఎస్ రిటైల్ సేల్స్ అంచనాలను మించుతూ 1.9 శాతం వృద్ధి చూపడంతో వారాంతాన పసిడి బలహీనపడినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. వినియోగ వ్యయాలు పెరగడం ఆర్థిక రికవరీకి సంకేతమని విశ్లేషకులు తెలియజేశారు.