రాత్రి 11 గంటలకూ ‘దారికి’ రాని వైనం  రాజధాని రోడ్లపై వాహనశ్రేణులు నత్తలతో పోటీ పడ్డాయి. రెండు రోజుల క్రితం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో రోడ్లు ఛిద్రం కాగా..శనివారం రాత్రి హఠాత్తుగా కురిసిన భారీ వర్షం తోడైంది. దీంతో రోడ్లన్నీ జలమయమై ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ ఆగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో కిలోమీటరు దూరం దాటడానికి కనీసం అరగంటకు పైగా పట్టిందంటే అతిశయోక్తి కాదు. ఇంకొన్ని చోట్ల గంటల తరబడి వాహనాలు ముందుకు కదలనే లేదు. వర్షం నేపథ్యంలో ద్విచక్ర వాహనచోదకులు మెట్రోరైల్‌ స్టేషన్ల కింద ఆగిపోవడంతో ఆ ప్రాంతాల్లో మరిన్ని ఇబ్బందులు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో వీకెండ్‌లో రోడ్డెక్కిన వాహనాలకు, చోదకుల ఒళ్లు హూనమై పోయింది. సుదీర్ఘకాలం నిరీక్షణతో వారి సహనానికి పరీక్షగా మారింది. అనేక ప్రాంతాల్లో రాత్రి పదకొండు గంటల వరకు ఇదే పరిస్థితి కొనసాగింది.