సుమారు రూ 1.3 కోట్ల నష్టం

 


 నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఒలింపిక్‌ మెడలిస్ట్, షూటర్‌ గగన్‌ నారంగ్‌ ‘గన్‌ ఫర్‌ గ్లోరీ (జీఎఫ్‌జీ) అకాడమీ’లోకి వరద నీరు వచ్చి చేరింది. సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి ప్రాంతంలో ఉన్న తన షూటింగ్‌ రేంజ్‌లోకి వరద నీరు చేరడంతో దాదాపు రూ. 1.3 కోట్లు విలువైన షూటింగ్‌ సామగ్రి పాడైనట్లు నారంగ్‌ గురువారం వెల్లడించాడు. ‘ 24 గంటల్లో అంతా నాశనమైంది. భారీ వరద మా షూటింగ్‌ రేంజ్‌ను ముంచెత్తింది. కొత్తగా తెచ్చిన 80 రైఫిల్స్, పిస్టల్స్‌తో పాటు ఇతర సామగ్రిని పూర్తిగా పాడు చేసింది. జీఎఫ్‌జీ సిబ్బంది 9 ఏళ్ల కష్టం వరద నీటిలో కొట్టుకుపోయింది’ అని ఆవేదనతో నారంగ్‌ పోస్ట్‌ చేశాడు. ఇప్పటికే కరోనా వల్ల ఏర్పడిన నష్టం చాలదన్నట్లు... తాజా వరదలు జీఎఫ్‌జీని ఆర్థికంగా దెబ్బ తీశాయని నారంగ్‌ వ్యాఖ్యానించాడు. జీఎఫ్‌జీని ప్రపంచస్థాయి షూటింగ్‌ అకాడమీగా మార్చేందుకు తాము రాత్రింబవళ్లు కష్టపడ్డామని, ఇకపై అకాడమీని మునపటిలా మార్చడానికి వీలవుతుందో లేదో చెప్పడం కష్టమని పేర్కొన్నాడు.