‘కోవిడ్‌-19 సంక్షోభం సమసిపోలేదు’  కోవిడ్‌-19తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తొలుత భయపడినంతగా కుప్పకూలకపోయినా అది సృష్టించిన సంక్షోభం ఇంకా సమసిపోలేదని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) చీఫ్‌ క్రిస్టాలినా జార్జివా పేర్కొన్నారు. కరోనా విధ్వంసంతో ప్రపంచం పెను ముప్పును ఎదుర్కొన్నాఈ ఏడాది అంతర్జాతీయ వృద్ధి అంచనాలు కొంతమేర పెంచే వెసులుబాటు కలిగిందని వచ్చేవారం జరగనున్న ఐఎంఎఫ్‌-ప్రపంచ బ్యాంక్‌ సమావేశాలకు ముందు ఆమె వ్యాఖ్యానించారు. ఈ భేటీలో తాజాపరిచిన వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్‌ ప్రపంచబ్యాంక్‌కు సమర్పించనుంది. ప్రపంచ జీడీపీ వృద్ధి దాదాపు ఐదు శాతం తగ్గుతుందని ఐఎంఎఫ్‌ ఈ ఏడాది జూన్‌లో అంచనా వేయగా, రెండు, మూడు త్రైమాసాల్లో ఫలితాలు ఆశించిన దానికంటే మెరుగ్గా వెల్లడయ్యాయి. కరోనా వైరస్‌తో ప్రభావితమైన వ్యక్తులు, సంస్ధలకు ప్రభుత్వాల నుంచి ఊతం లభించడంతో ప్రపంచ వృద్ధి రేటు పుంజుకుందని ఆమె పేర్కొన్నారు. అయితే కోవిడ్‌-19 నేపథ్యంలో ప్రభుత్వాలు చేస్తున్న సాయం ముందస్తుగా నిలిపివేయరాదని, వచ్చే ఏడాది వృద్ధిరేటు అంచనాలపై అనిశ్చితి నెలకొన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. పది లక్షల మందిని బలిగొన్న అనంతరం కూడా ఈ వైపరీత్యం ఇంకా సమసిపోయేందుకు చాలా దూరంగా ఉందని అన్నారు. అన్ని దేశాలు ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకునేందుకు సుదీర్ఘ అసమాన పోరాటం చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు.