క్యూ2లో 3 శాతం డౌన్‌

 


 ఐటీ సేవల దిగ్గజం విప్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 2,465 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌) నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో ప్రకటించిన రూ. 2,553 కోట్లతో పోలిస్తే లాభం 3.4 శాతం క్షీణించింది. మరోవైపు, ఆదాయం దాదాపు గత క్యూ2 స్థాయిలోనే రూ. 15,114 కోట్లుగా నమోదైంది. ఇక డిసెంబర్‌ క్వార్టర్‌లో ఐటీ సేవల విభాగం ఆదాయం 202.2–206.2 కోట్ల డాలర్ల స్థాయిలో ఉండొచ్చని, సీక్వెన్షియల్‌గా చూస్తే 1.5–3.5 శాతం వృద్ధి సాధించవచ్చని అంచనా వేస్తున్నట్లు విప్రో తెలిపింది. సెప్టెంబర్‌ క్వార్టర్‌లో ఇది 199.24 కోట్ల డాలర్లుగా నమోదైంది. సీక్వెన్షియల్‌గా చూస్తే 3.7 శాతం వృద్ధి సాధించింది. ‘ఆదాయాలు, మార్జిన్లపరంగా ఈ త్రైమాసికం అద్భుతంగా గడిచింది. మా ముందు అనేక ఆసక్తికరమైన వ్యాపారావకాశాలు ఉన్నాయి‘ అని విప్రో సీఈవో థియెరి డెలాపోర్ట్‌ తెలిపారు. ప్రాధాన్యతా రంగాలు, మార్కెట్లపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన వివరించారు. కన్జూమర్, ఆర్థిక సేవల విభాగాలు మెరుగైన పనితీరు కనబపర్చగలవని డెలాపోర్ట్‌ తెలిపారు. సెప్టెంబర్‌ త్రైమాసికంలో కొత్తగా 3,400 మంది సిబ్బందిని తీసుకోవడంతో ఉద్యోగుల సంఖ్య 1,85,243కి చేరింది. అట్రిషన్‌ (ఉద్యోగుల వలసలు) రేటు 11 శాతంగా ఉంది.