క్యూ2లో రూ. 3,142 కోట్లు వివిధ వ్యాపార విభాగాలు మెరుగైన పనితీరు కనపర్చడంతో జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ నికర లాభం 18.5 శాతం వృద్ధి చెందింది. రూ. 3,142 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నికర లాభం రూ. 2,651 కోట్లు. మరోవైపు, ఆదాయం 6 శాతం పెరిగి రూ. 17,528 కోట్ల నుంచి రూ. 18,594 కోట్లకు చేరింది. షేరు ఒక్కింటికి రూ. 4 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ‘కొత్త ఆర్డర్లు భారీగా వచ్చాయి. గత క్వార్టర్‌తో పోలిస్తే 35 శాతం పెరిగాయి‘ అని సంస్థ సీఈవో సీ విజయకుమార్‌ వెల్లడించారు. త్రైమాసికాలవారీగా చూస్తే ఒప్పందాల సంఖ్య ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిలో నమోదైందని వివరించారు. జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జపాన్, కెనడా తదితర మార్కెట్లలో పెట్టుబడులను పెంచనున్నట్లు విజయకుమార్‌ చెప్పారు. మూడు, నాలుగో త్రైమాసికాల్లో ఆదాయ వృద్ధి సగటున 1.5–2.5 శాతం ఉండగలదని హెచ్‌సీఎల్‌ టెక్‌ గైడెన్స్‌ ఇచ్చింది. హెచ్‌–1బీ వీసాలపై అమెరికా ప్రభుత్వ ఆంక్షల అంశం మీద స్పందిస్తూ తమ ఉద్యోగుల్లో మూడింట రెండొంతుల మంది స్థానికులే ఉన్నారని విజయకుమార్‌ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యయాలపరంగా తమపై దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని, వచ్చే ఏడాది మాత్రం కొంత ఉండవచ్చని తెలిపారు.