టి20 చాలెంజ్‌ సిరీస్‌కు బీసీసీఐ సన్నాహాలు
  మహిళల టి20 చాలెంజ్‌ సిరీస్‌ కోసం భారత మహిళా క్రికెటర్లను ఈనెల 13న ముంబైకి రావాల్సిందిగా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదేశించింది. మొత్తం 30 మంది క్రికెటర్లకు పిలుపునిచ్చినట్లు తెలిపింది. ‘క్రికెటర్లకు సమాచారమిచ్చాం. వాట్సప్‌ గ్రూప్‌ కూడా ఏర్పాటు చేశాం. అండర్‌–19 ప్లేయర్లు కొందర్ని ఎంపిక చేశాం’ అని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ముంబైకి చేరుకున్న ప్లేయర్లు వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. పలుమార్లు కోవిడ్‌–19 పరీక్షల అనంతరం అక్టోబర్‌ 22న యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) బయల్దేరి వెళ్లనున్నారు. మరో వారం రోజుల క్వారంటైన్‌ అనంతరం బయో బబుల్‌లో అడుగుపెడతారు. ఈ తతంగం అంతా ముగిసేసరికి ఆటగాళ్లకు సరైన ప్రాక్టీస్‌ లేకుండానే టోర్నీ బరిలో దిగాల్సి ఉంటుంది. ఈ అంశంపైనే ఆటగాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెటరన్‌ ప్లేయర్లు మిథాలీ రాజ్, జులన్‌ గోస్వామి కూడా ఈ టోర్నీలో పాల్గొననున్నారు. షెడ్యూల్‌ ప్రకారం మూడు జట్లతో జరిగే నాలుగు మ్యాచ్‌ల ‘మహిళల టి20 చాలెంజర్‌ టోర్నీ’ షార్జా వేదికగా నవంబర్‌ 4 నుంచి 9 వరకు జరుగనుంది.