సెన్సెక్స్‌ లాభం 255 పాయింట్లు

 


 కనిష్ట స్థాయిల వద్ద మెటల్, ఫైనాన్స్, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం లాభాలతో ముగిసింది. సెనెక్స్‌ 255 పాయింట్లు పెరిగి 39,983 వద్ద, నిఫ్టీ 82 పాయింట్ల లాభంతో 11,762 వద్ద స్థిరపడ్డాయి. మునుపటి రోజు మార్కెట్‌ భారీ పతనంతో ప్రధాన షేర్ల వ్యాల్యుయేషన్లు దిగివచ్చాయి. అలాగే ధరలు గరిష్టస్థాయిల నుంచి కనిష్టాలకు చేరుకున్నాయి. ఇదే అదనుగా భావించిన ఇన్వెస్టర్లు కనిష్ట స్థాయిల వద్ద చిన్న, మధ్య తరహా షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. అయితే ఐటీ, మీడియా షేర్లు మాత్రం స్వల్పంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్‌ సూచీలో మొత్తం 30 షేర్లకుగానూ 24 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఎఫ్‌ఐఐలు, డీఐఐలు ఇరువురూ శుక్రవారం నికర అమ్మకందారులుగా ఉన్నారు. ఎఫ్‌ఐఐలు రూ.479 కోట్ల షేర్లను, డీఐఐలు రూ.430 కోట్ల షేర్లను విక్రయించారు. ఈ వారంలో సెనెక్స్‌ 526.51 పాయింట్లు(1.29 శాతం), నిఫ్టీ 157.75 పాయింట్లను కోల్పోయాయి. రెండోదశ కరోనా కేసుల విజృంభణతో అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ వైఖరి నెలకొని ఉంది.