287 డిజైన్లతో చీరలు  నేత కార్మికులకు ఉపాధి కల్పించడం, మహిళలకు పండుగ కానుక అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘బతుకమ్మ చీరలు’పంపిణీ కార్యక్రమం శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఈ నెల 17న మొదలయ్యే బతుకమ్మ పండుగను దృష్టిలో పెట్టుకుని ఆలోపే చీరల పంపిణీని పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది కోటి చీరలు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ఆయా జిల్లాలకు 98.5 లక్షల చీరలను చేరవేశారు. క్షేత్రస్థాయిలో చీరల పం పిణీ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించగా, గ్రామ కార్యదర్శులు, రేషన్‌షాప్‌ డీలర్లు, సెర్ప్, మెప్మా మహిళా స్వయం సహాయక సంఘాల సహకారంతో లబ్ధిదారులకు అందజేస్తారు. పంపిణీలో కోవిడ్‌ నిబంధనలు పాటించాలని కలెక్టర్లకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.