32 మందితో కంగారూ గడ్డకు

 


 వచ్చే నెలలో కోహ్లి సేన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. పూర్తిస్థాయిలో అన్ని ఫార్మాట్లు ఆడనున్న నేపథ్యంలో అక్కడికి టీమిండియా జంబో సేనతో బయల్దేరుతుంది. పైగా కరోనా ప్రొటోకాల్‌ కూడా ఉండటంతో ఒకేసారి భారీ జట్టునే పంపనున్నట్లు తెలిసింది. మొత్తం 32 మంది ఆటగాళ్లు ఆస్ట్రేలియా పర్యటనకు వెళతారు. ఇందులో భారత్‌ ‘ఎ’ ఆటగాళ్లు కూడా ఉంటారు. యూఏఈలో ప్రస్తుతం ఐపీఎల్‌ ఆడుతున్న క్రికెటర్లు అక్కడి నుంచే నేరుగా ఆసీస్‌కు పయనమవుతారు. కరోనా మహమ్మారి తర్వాత కోహ్లి సేన ఆడే తొలి అంతర్జాతీయ సిరీస్‌ ఇదే. రెండున్నర నెలల పాటు సాగే ఈ పర్యటనలో భారత్‌ మూడు టి20లు, మూడు వన్డేలతోపాటు నాలుగు టెస్టుల సిరీస్‌లో పాల్గొంటుంది. ఇందులో ఒక డే–నైట్‌ టెస్టు జరుగుతుంది. పరిమిత ఓవర్ల సిరీస్‌ ముగిశాక టెస్టు జట్టులో లేని ఆటగాళ్లను స్వదేశానికి పంపే అవకాశాల్ని అప్పటి పరిస్థితుల్ని బట్టి తీసుకుంటుంది.