34 పరుగులతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ఘనవిజయం


అన్ని విభాగాల్లో అదరగొట్టిన డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌లో మరో జబర్దస్త్‌ విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను రోహిత్‌ శర్మ బృందం 34 పరుగులతో చిత్తుగా ఓడించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 208 పరుగులు చేసింది. డికాక్‌ (39 బంతుల్లో 67; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇషాన్‌ కిషన్‌ (23 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించగా... కృనాల్‌ పాండ్యా (4 బంతుల్లో 20 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చివర్లో విధ్వంసం సృష్టించాడు. భువనేశ్వర్‌ స్థానంలో వచ్చిన సందీప్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌ను భర్తీ చేసిన సిద్ధార్థ్‌ కౌల్‌ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 174 పరుగులే చేయగలిగింది. కెప్టెన్‌ వార్నర్‌ (44 బంతుల్లో 60; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బౌల్ట్, ప్యాటిన్సన్, బుమ్రా తలా 2 వికెట్లు తీశారు.